ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఆందోళనలో పడిపోయింది. హిందుస్తాన్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్, ఏబీపీ న్యూస్‌ల సర్వేలో బీజేపీపై ఆప్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించడంతో ఇప్పుడు కమలదళం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ 34 నుంచి 37 సీట్లు సాధిస్తుందని ఈ సర్వేల్లో తేలింది. మొదట మోడీ మానియాకుతోడు కిరణ్‌బేడీకి ప్రజల్లో ఉన్న అభిమానంతో తాము సులభంగా అధికారంలోకి వస్తామని బీజేపీ భావించింది. అయితే పలువురు ముఖ్య నాయకులు పార్టీ వీడిపోయినా కేజ్రీవాల్ మాత్రం ప్రచారంలో ఎక్కడా వెనక్కితగ్గలేదు. గతంలో కంటే కూడా విస్తృతంగా ఈసారి ఆప్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఇక సర్వేల ఫలితాలో బీజేపీ ప్రధాన నాయకులు ఢిల్లీ ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. ఇక ఎన్నికలలోపు మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయవద్దని స్థానిక నాయకులకు సూచించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఢిల్లీలోనూ అధికారంలోకి రావడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో పార్టీలోని ప్రధాన నాయకులందరూ ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని మోడీ సూచించినట్లు సమాచారం.