సాధారణంగా మన టాలీవుడ్ నిర్మాతలు పలు తమిళ చిత్రాల అనువాద హక్కులను కోట్లు వెచ్చించి తీసుకుంటూ ఉంటారు. దానికి 'సికిందర్, లింగ, ఐ' వంటి చిత్రాలే ఉదాహరణ. కానీ మన తెలుగు సినిమాలను కోలీవుడ్ పెద్దగా పట్టించుకోదు. 'బాహుబలి' చిత్రం విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' చిత్రం కూడా తమిళంలో బాగా ఆడింది. దాంతో 'బాహుబలి' చిత్రానికి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం తమిళంలో 'మహాబలి'గా రానుంది. ఈ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యానని సమాచారం. హీరో సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ఈ రైట్స్ తీసుకున్నాడట. 45 నిమిషాల వెర్షన్ ను చూసి మరీ కొనుగోలు చేసారట. మొత్తం 27 కోట్లకు తమిళ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ చిత్రం మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే ఇంత మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు సినిమా రేంజ్ ను పెంచుతున్న ఘనత రాజమౌళికి దక్కుతోంది.