రాజయ్య తొలగింపు విపక్షాలకు పెద్ద ఆయుధాన్ని అందించింది. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ, బీజేపీలో విమర్శనస్త్రాను ఎక్కుపెడుతున్నాయి. ఇక రాజయ్యను అక్రమంగా తొలగించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితుణ్ని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని, ఇప్పుడు కూడా అక్రమంగా ఓ దళిత ఉప ముఖ్యమంత్రిపై అభండాలు వేసి పదవినుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాజయ్య తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే పదవినుంచి తొలగించడంతో రాజయ్య పార్టీ మారుతారని అందరూ భావించారు. కాని ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్‌నే వీడే ఆలోచనలో ఉన్నట్లు కనబడటం లేదు. మరి దీనివెనుక కూడా పెద్ద వ్యూహమే ఉండవచ్చన్న భావన మీడియా వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి జరిగిన అంశాల్లో రాజయ్య తొలగింపు అత్యంత వివాదాస్పదమైనదిగా గుర్తించవచ్చు.