రాశిఫలాలు ` గ్రహణకాల సమయం, శుభాశుభాలు ` వాస్తు విశేషాలు ` తాయెత్తులు, యంత్రాలు, రాళ్ళు తదితర కార్యక్రమాలను ప్రసారం చేయని తెలుగు టివి ఛానల్స్ ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. ‘వాస్తు’ రీత్యా తెలంగాణ ` సెక్రటేరియేట్‌ని ఎర్రగడ్డకు మార్చాలన్న కెసిఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ రాజధానిని మార్చిన చారిత్రక సంఘటనలతో పోల్చుతున్నారు. చర్చావేదికలు పుంఖాను పుంఖాలుగా ప్రసారమవుతున్నాయి. ఓవైపు వాస్తుకి విశేష ప్రాధాన్యత ఇస్తూ మరోవైపు కెసిఆర్ నిర్ణయాన్ని నిరసించడంలోని ఔచిత్యమేమిటో వారి విజ్ఞతకే వదిలేద్దాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘వాస్తు’ పేరుతో అమరావతి పరిసరాలలోని తుళ్ళూరు తదితర గ్రామాల భూములను రాజధానికి తీసుకుంటున్నారు. కృష్ణానదికి దక్షిణాన రాజధాని స్థల ఎంపికను హర్షిస్తున్నవారికి గోదావరి నదికి దక్షిణాన పశ్చిమగోదావరి ` కృష్ణా జిల్లా ఉన్నాయన్న సంగతి తెలియదా? ఇక్కడ ప్రభుత్వ భూములు కూడా పెద్ద సంఖ్యలో వున్నాయి. గన్నవరం విమానాశ్రయం ` విజయవాడ రైల్వేజంక్షన్ గుర్తుకురాలేదా? కృష్ణానది ఒడ్డునే రాష్ట్ర రాజధాని ఎందుకు నిర్మించాలి? గోదావరి ఒడ్డున ఎందుకు నిర్మించగూడదు? అమరావతికి ఎంతటి ఘనచరిత్ర వుందో రాజమండ్రికీ అంతటి చరిత్రవుంది!
ఘనాంకాలలో ఘనాపాటీలు అయిన ఏలూరు మాజీ ఎంపీ కావూరి, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి మౌనముద్ర వెనుక మర్మం టివి ఛానల్స్ చర్చా కార్యక్రమాలలో పాల్గొనే విశ్లేషకులకు తెలియనిది కాదు.
-తోటకూర రఘు