‘‘ఇటు చంద్రబాబు ` అటు కెసిఆర్ : చంద్రులు ఇద్దరూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే పరిస్థితి కనిపించడంలేదు. పార్టీలలోనే కాదు, ప్రజలలో అసంతృప్తి ఆరంభమయింది. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మెగా కుటుంబంవైపు ఆశలు పెట్టుకున్నారు. పవన్ ‘‘అత్తారింటికి దారేది’’ వంటి ఫ్యామ్లీ ఎంటర్‌టైనర్ చిరంజీవి 150వ సినిమాగా రావాలని తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.’’
తెలుగు సినీ పరిశ్రమలో స్తబ్ధత అలుముకుంది. ‘‘బాహుబలి, రుద్రమదేవి’’ చిత్రాల గురించి వినీ వినీ కొత్త సంచలనంకోసం ఎదురుచూస్తోంది తెలుగు సినీ ప్రేక్షకలోకం. రాఘవేంద్రరావు ` నాగార్జున కాంబినేషన్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు గ్రూపులుగా విడిపోయారు. అభిమానుల సినిమాలుగా మిగిలిపోతున్నాయి. దీనివల్లనే సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ మినహా ‘రన్’ రావడంలేదు. గతంలో ఫ్యామ్లీ ఆడియన్స్ ` రిపీట్ ఆడియన్స్ వుంటేవారు. ‘‘మాయాబజారు ` లవకుశ ` దేవదాసు ` ఖైదీ ` అడవిరాముడు ` శంకరాభరణం ` ప్రేమాభిషేకం ` మేఘసందేశం ` పెదరాయుడు ` మోసగాళ్ళకు మోసగాడు ` అల్లూరి సీతా రామరాజు’’ తదితర చిత్రాల రన్‌తో క్యాలెండర్లు మారిపోయేవి. ఇప్పుడు అటువంటి సినిమా రావలసిన అవసరం వుంది. ఆ సినిమా చిరంజీవి 150వ సినిమా కావాలని తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
`ఇది ‘‘బొమ్మా బొరుసు’’ వున్న నాణానికి ఓ వైపు. మరోవైపు చిరంజీవికి రాజకీయ జీవితమూ వుంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ప్రకటనలకే పరిమితమవుతోంది. చంద్రబాబు చెప్పింది చేయగలడా? అన్న అనుమానం ప్రజలలో పురుడుపోసుకుంది. కాంగ్రెసు అధినాయకత్వం రోజురోజుకీ బలహీనపడుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెసుకి ఊపిరిపోయడం కష్టం. కానీ తెలుగు ప్రజలు చిరంజీవిని పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు. తెలుగు ప్రజలు చంద్రబాబుకి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కునే సమయం తరుముకొస్తోంది. తెలుగు జనం చిరంజీవివైపు చూస్తోంది!!
పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయమని తేలిపోయింది. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు చిరంజీవి బిజెపి తీర్ధం స్వీకరించాలని కోరుకుంటున్నారు. చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియనున్నది.
-తోటకూర రఘు