ఇటీవలె ఉద్వాసనకు గురైన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరడం టీఆర్‌ఎస్ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆయనకు గుండెపోటు వచ్చిందని మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో ఈనెపం కేసీఆర్ మీదకే వెళుతుందని ఆ పార్టీ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. పదవి పోయిన వెంటనే రాజయ్య అస్వస్థతకు గురికావడం, అందునా ఆయన దళిత వర్గానికి చెందిన వారు కావడంతో ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనని ఆ పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపట్లోనే బయటకు వచ్చిన రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏమీ కాలేదని, షుగర్, బీపీ లెవల్స్ తగ్గిపోవడంతోనే ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. దీంతో ఈఆర్‌ఎస్ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఇక తాను ఎలాంటి తప్పు చేయకున్నా మంత్రి పదవినుంచి తొలగించారని, అయినా టీఆర్‌ఎస్ పార్టీలోనే తాను కొనసాగుతానని రాజయ్య మరోసారి స్పష్టం చేశాడు.