వైవిధ్య భరితమైన చిత్రాలను చేయడంలో ఆసక్తి చూపించే నాగార్జున గతంలో రాఘవేంద్రరావు దర్శకతంలో 'అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి...' వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా నాగ్ త్వరలో ఏసుక్రీస్తు పాత్రను కూడా పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం నాగ్ త్వరలో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే 'ఏడుకొండలవాడు' అనే టైటిల్ తో ఓ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇలాంటి చిత్రాలకు రచన చేయడంలో అందెవేసిన చెయ్యి వంటి రచయిత భారవి ఈ చిత్రానికి రచన చేస్తున్నాడట. ఇది భక్తిరస చిత్రమా, లేక పౌరాణిక చిత్రమా? అనేది తెలియాల్సివుంది. 'వెంకటేశ్వరస్వామి మహాత్యం' తరహాలో పౌరాణిక చిత్రమే అంటున్నారు. కాగా నాగ్ తో 'షిర్డీసాయి' చిత్రాన్ని తీసిన మహేష్ రెడ్డి ఈ చిత్రాన్నికూడా నిర్మించనున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలుస్తాయి.