వైద్యశాఖలో చోటుచేసుకున్న అక్రమాల కారణంగానే రాజయ్యను డిప్యూటీ సీఎం పదవినుంచి తొలగించినట్లు టీఆర్‌ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ అవినీతిని ఏమాత్రం సహించడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని భావించవచ్చు. అయితే గతంలో కేసీఆర్ కూడా అవినీతికి పాల్పడటంతోనే చంద్రబాబు మంత్రి పదవినుంచి తొలగించినట్లు టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఏ అవినీతికి పాల్పడింది కూడా చెప్పిన తర్వాతే చంద్రబాబు ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించారన్నారు. అదే కేసీఆర్ మాత్రం ఎలాంటి కారణం చెప్పకుండానే రాజయ్యను డిప్యూటీ సీఎం పదవికి దూరం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ముగ్గురు మాత్రమే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, మిగిలిన వారంతా అవకాశవాదులేనని ఎర్రబెల్లి ఆరోపించారు. అయితే 1999లో మంత్రి పదవి ఇవ్వనందునే కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ పెట్టి... ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టారు. ఒకవేళ బాబు అప్పుడే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. ఎర్రబెల్లి పరోక్షంగా చెబుతున్నట్లు కనిపిస్తోంది.