హీరో సందీప్ కిషన్ కు టాలెంట్ ఉన్నప్పటికీ ఆయనకు వరుసగా సినిమా చాన్స్ లు రావడం వెనక ఆయన మామయ్య.. కెమెరామెన్ చోటా కె.నాయుడు అండదండలు బాగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇక టాలెంట్ కు సినీఫీల్డ్ లో అండదండలు పుష్కళంగా ఉంటే కొదవేముంది? అందుకే సందీప్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తర్వాత ఒక్క హిట్ లేకపోయినా తన మామయ్య అండతో వరుస సినిమాలు చేస్తున్నాడు. పనిలోపనిగా తన మేనల్లుడు సందీప్ నటించే చిత్రాలకు సైతం తానే సినిమాటోగ్రాఫర్ గా చోటా పనిచేస్తున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, బీరువా' వంటి చిత్రాలను పట్టాలెక్కించింది కూడా చోటానే అని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 'టైగర్' కూడా ఇదే కోవ చిత్రం అంటున్నారు. అంతేగాదు... సందీప్ హీరోగా నటించే చిత్రాలకు చోటా తెరవెనుక నిర్మాణ భాగస్వామిగా ఉంటూ ఆయా చిత్రాలకు ఫైనాన్స్ సమస్యలు ఎదురుకాకుండా చూస్తుంటాడని టాక్. మొత్తానికి ఇలాంటి మేనమామ దొరకడం సందీప్ కిషన్ అదృష్టం కాక మరేమిటి చెప్పండి...!