అందరూ అనుకున్న విధంగానే రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. ఆయన పనితీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గతంలో అనేక వార్తలొచ్చాయి. ఇకా రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రభావం అధికమవగానే ఇక రాజయ్య పదవి తొలగించనున్నట్లు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనికితోడు వైద్యశాఖలో తీవ్ర అవినీతి చోటుచేసుకున్నట్లు ఇంటలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఇక డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ పరోక్షంగా రాజయ్యకు సూచనలు పంపినప్పటికీ అతడు స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి పదవినుంచి రాజయ్యను తొలగించాలని గవర్నర్ నరసింహన్‌కు సిఫారుసు చేసినట్లు సమాచారం. దీనికి వెంటనే గవర్నర్ రాజముద్ర వేయడంతో రాజయ్య పదవిని కోల్పోయాడు. దీనికిబదులుగా రాజయ్య గౌరవప్రదంగా పదవి నుంచి తొలగి ఉంటే బాగుండేదని టీఆర్‌ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.