తెలుగు చలనచిత్ర పరిశ్రమను విషాదం వెంటాడుతోంది. ఈమధ్యకాలంలో దర్శకులు, నిర్మాతలు, కమెడియన్స్, కారెక్టర్ ఆర్టిస్టులను చిత్ర పరిశ్రమ కోల్పోతోంది. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మరణవార్త మరచిపోక ముందే మరో హాస్యనటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు యం.యస్.నారాయణ ఈరోజు హైదరాబాద్‌లో మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం అస్వస్థతతో హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఎం.ఎస్. ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె వున్నారు. 1951 ఏప్రిల్ 16న జన్మించిన మైలవరపు సూర్యనారాయణ భీమవరంలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. రచయిత అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కొన్ని సినిమాలకు రచన చేసిన ఎం.ఎస్. మోహన్‌బాబు హీరోగా నటించిన ‘పెదరాయుడు’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ ద్వారా నటుడుగా పరిచయమై ‘మానాన్నకి పెళ్ళి’ చిత్రంతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరసగా ఆనందం, నువ్వు నాకు నచ్చావ్, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, యమదొంగ, దేశముదురు వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను నవ్వులో ముంచెత్తారు. ఈమధ్యకాలంలో ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు దూకుడు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ వున్నప్పటికీ ఎం.ఎస్. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, డైలాగ్ మాడ్యులేషన్ చాలా డిఫరెంట్‌గా వుంటూ ప్రేక్షకుల్ని నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. ముఖ్యంగా తాగుబోతు పాత్రలు చేయడంలో ఎం.ఎస్.నారాయణ దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో కుమారుడు విక్రమ్ హీరోగా ‘కొడుకు’ చిత్రం రూపొందింది. ఆ తర్వాత ‘భజంత్రీలు’ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఆయన కుమార్తె శశికిరణ్ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంచి నటుడుగానే కాకుండా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న యం.యస్.నారాయణ మరణం తెలుగు సినిమా హాస్యానికి తీరని లోటు అని చెప్పాలి. ఆయన మరణ వార్త యావత్ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. ఎం.ఎస్.నారాయణ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.