వచ్చే నెల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. తమకు తక్షణ సాయంగా రూ. 2500 కోట్లు అందించి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. అయితే ఒక్కసారిగా రాష్ట్ర పరిస్థితులు అంత దారుణంగా ఎందుకు మారాయన్నది అర్థంకాకుండా ఉంది. వారం క్రితం సంక్రాంతి సంబురాల పేరుతో దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు కానుకలు అందజేసిన చంద్రబాబు.. మరి ఉద్యోగుల వేతనాల గురించి కూడా పట్టించుకోకుండా ఎలా వ్యవహరించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి కేంద్రం నుంచి సాయం పొందడానికే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఉద్యోగులకు పీఆర్‌సీ ఎగ్గొట్టడానికే బాబు ఈ మార్గం ఎంచుకొని ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినబడుతున్నాయి. ఈ తరుణంలో వేతనాలకే డబ్బులు లేవని చెబితే పీఆర్‌సీ అమలు చేయమని అడగడానికి ఉద్యోగులు సాహసించరని, ఒకవేళ అడిగినా బాబు ఎంత తక్కువ ఇచ్చినా ఇబ్బంది లేకుండా అంగీకరించే అవకాశం ఉందని, ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే బాబు ఆర్థిక సంక్షోభం పేరుతో కొత్త నాటకానికి తెర తీశాడని వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆరోపిస్తున్నారు.