ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. వచ్చేనెల ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడానికి ఖజానాలో నిధులు లేని పరిస్థితుల్లో కూరుకుపోయింది. దీంతో తక్షణమే తమకు రూ. 2500 కోట్ల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కొద్ది రోజుల ముందు ఢిల్లీలో సీఎం చంద్రబాబునాయుడు కూడా కేంద్రం సాయం లేనిదే ఏపీలో ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సవివరంగా లేఖ రాసింది. రాష్ట్రంలో మొత్తం ఐదున్నర లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఖజానాలో మాత్రం కేవలం రూ. 1200 కోట్లే ఉన్నట్లు చెప్పింది. దీనిలో రూ. 1000కోట్లు ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు, రూ. 200 కోట్లు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు పంపిణీ చేసిన సరుకులకు చెల్లించాల్సి ఉన్నట్లు స్పష్టం చేసింది. తక్షణం రూ. 2500 కోట్లు చెల్లించకపోతే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని తెలిపింది. మరి రాష్ట్ర ప్రభుత్వ మొరను మోడీ ఎంతవరకు పట్టించుకుంటారోనన్నది వేచిచూడాల్సిందే..!