ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కిరణ్‌బేడి అనుహ్యంగా తెరపైకి వచ్చారు. ఆమె పార్టీలో చేరడమే ఆలస్యం ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం కిరణ్‌బేడి పేరును ఖరారు చేసింది. నిజాయితీపరురాలిగా, సమర్థవంతమైన అధికారిగా పేరుగాందిన కిరణ్‌బేడి ప్రతిష్ట బీజేపీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీనికితోడు మోడీ మానియా, ఆప్‌పై వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్ దిగజారుడుతనం తమకు కలిసివస్తుందనేది ఆ పార్టీ విశ్లేషకుల అంచనా. అయితే ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలయితే బాధ్యత ఎవరు వహిస్తారన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. గెలిస్తే ఆ క్రెడిట్ అంతా మోడీ ఖాతాలో పడిపోతుందని, ఓడిపోతే మాత్రం కిరణ్‌బేడిని బాధ్యురాలిగా చూపించి బలిపశువును చేసే అవకాశాలున్నాయని ఆప్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇవేవీ పట్టించుకోని కిరణ్‌బేడి ఏకంగా ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీకి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఆప్ విజయం కోసం కలిసి కష్టపడి చేసిన వీరిద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీకి సిద్ధమవుతున్నారు. మరి వీరిద్దరిలో విజయం ఎవర్ని వరించనుందో త్వరలోనే తేలనుంది.