ఇంతవరకు పరభాషా హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్ల పై మోజు పడిన మన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు పరభాషా కమెడియన్ల పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. తమిళంలో చాల చిన్న వయసులోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు సంతానం. ఇక్కడ బ్రహ్మానందం ఎలాగో, కోలీవుడ్ లో సంతానం అంతకంటే ఎక్కువ. అక్కడి వారికి సంతానం లేనిదే సినిమా చూసిన అనుభూతి మిగలదు. ఒకవైపు కమెడియన్ గా చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా చేస్తున్న ఆయన రోజుకు 5 నుండి 6 లక్షలు వరకు తీసుకుంటాడని సమాచారం. మన టాలీవుడ్ డైరెక్టర్స్ చాలామంది ఆయన చేత తెలుగులో నటింపజేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీనువైట్ల త్వరలో తను రామ్ చరణ్ హీరోగా తీయబోయే చిత్రంలో సంతానం చేత ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయించాలని భావిస్తున్నాడట. తనను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయనకు ఎప్పటి నుండో బ్రహ్మానందం పై ఓ రకమైన అభిప్రాయం ఉందని సమాచారం. దాంతో బ్రహ్మానందం హవాను తగ్గించాలంటే సంతానమే దానికి సరిజోడు అని ఆయన భావించాడని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. అంతేకాక ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తమిళంలోకి కూడా అనువాదం చేసి ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నాడట. దాంతో తన తమిళ కెరీర్ కు సంతానం బాగా ప్లస్ అవుతాడనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఆఫర్ ను సంతానం ఒప్పుకుంటాడో లేదో చూడాలి...! ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం.. హీరోలు, ఇతర ఆర్టిస్టుల సంగతి ఏమోగానీ హాస్యనటుల విషయంలో పరభాషా ఆర్టిస్టు బాగా సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడా పెద్దగా లేవు అనేది వాస్తవం...!