అవకాశం దొరకడమే ఆలస్యం కొట్టుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వెనుకడుగు వేయడం లేదు. సర్దుకుపోదామన్న సంగతిని పక్కనపెట్టి ప్రతి విషయంలోనూ రెండు ప్రభుత్వాలు తగువులాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు విషయాల్లో గొడవపడ్డ ఈ రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి కూడా విభేదాలు వచ్చాయి. ఈ ట్రస్టుపై తమదే ఆధిపత్యం అంటూ రెండు ప్రభుత్వాలు అధికారులను నియమిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ ట్రస్టుకు ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్‌ను సీఈఓగా నియమించగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జ్యోతి బుద్ద ప్రసాద్‌ను సీఈఓగా నియమించింది. దీంతో ఈ ట్రస్టుపై ఎవరిది ఆధిపత్యమనే విషయమై సందిగ్ధం నెలకొంది. అయితే ఓ అడుగు వెనక్కు వేసిన ఏపీ ప్రభుత్వం తాము అధికారిని నియమించడం వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు రావని, తెలంగాణ ప్రభుత్వం ఏయే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తుందో తాము కూడా అవే ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని ప్రకటించింది.