ఫైర్‌బ్రాండ్ మమతాబెనర్జి ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. శారదా కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో ఆమె దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇదే అదనుగా గతంలో ఆమెతో చీవాట్లు తిన్న తృణమూల్ నాయకులు పార్టీ వీడి మూటముల్లె సర్దుకొని బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓ క్యాబినేట్ మంత్రి బీజేపీలో చేరగా కొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాటపట్టనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా రైల్వే మాజీ మంత్రి దినేష్ త్రివేది కూడా పార్టీ వీడటానికి సిద్ధమవుతున్నారు. యూపీఏ హయాంలో తృణముల్ పార్టీ తరఫున రైల్వే మంత్రిగా ఉన్న దినేష్ త్రివేది రైల్వే టికెట్ల ధరలు పెంచగానే వెంటనే మమతా ఆయన్ను ఆ మంత్రి పదవి నుంచి దించేశారు. అప్పటికి ఊరుకున్న దినేష్ త్రివేది ఇప్పుడు అదను చూసి ఆమెను దెబ్బతీస్తున్నాడు. ఎన్నికలకు ముందు పార్టీ మారి మమతాపై ప్రతీకారం తీర్చుకోవడానికి తృణముల్ నాయకులు చూస్తుండటం ఎంతైనా బీజేపీకి కలిసొచ్చే విషయమే.