తెలుగు దర్శకులకు సరిగ్గా సరికొత్త తరహా చిత్రాలు తీయడం రాదనే వాదన కొందరు వినిపిస్తుంటారు. ఈ విషయంలో తమిళ మేకర్స్ కు, హీరోలకు ఉన్న టేస్ట్ మన వాళ్లకు లేదనేది వారి వాదన. అయితే వాటికి ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయి. తమిళ మేకర్స్ ఏమీ దేవుళ్ళు కాదని ఇటీవల విడుదలైన అనేక చిత్రాలు నిరూపిస్తూ, మేకర్స్ కు, బయ్యర్ల కు కనువిప్పు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అనుష్క 'వర్ణ' సూర్య 'సికిందర్', రజనీకాంత్ 'కొచ్చాడయాన్', లింగ' చిత్రాలతో పాటు మన వారు అబ్బురపడేవిధంగా చూసే ది గ్రేట్ శంకర్ తీసిన తాజా చిత్రం 'ఐ' కూడా ఇదే విషయాన్ని రుజువుచేస్తోంది. మంచి సినిమాలు అన్ని భాషల్లో వస్తాయని, అంతేకానీ, పనిగట్టుకుని మన సినిమాలను చులకనగా చూడటం మానుకోవాలనే బలమైన సందేశాన్ని ఇవి అందరికి తెలియచేస్తున్నాయి. దీంతో ఇకపై రాబోయే తమిళ చిత్రాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయానికి మన నిర్మాతలు కూడా వచ్చినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.