అభినవ బాపుగా పేరుపొంది... తన కెరీర్ లో 'ఒక్కడు, చూడాలని వుంది' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసినప్పటికీ అదే స్థాయిలో 'సైనికుడు,మృగరాజు, నిప్పు' వంటి అనేక డిజాస్టర్స్ అందించిన దర్శకుడు గుణశేఖర్. ఆయనతో సినిమా చేస్తే విపరీతంగా నిర్మాతల చేత డబ్బు ఖర్చు పెట్టిస్తాడని, అనవసరమైన సెట్స్ వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతాడని, దర్శకునిగా నిలకడ లేదని.. ఇలా పలు విమర్శలను మూటగట్టుకున్న ఆయన చిట్టచివరకు విసిగివేసారి తానే నిర్మాతగా మారి, లోబడ్జెట్ సినిమా కాకుండా ఏకంగా చారిత్రాత్మక కథ అయిన 'రుద్రమదేవి' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఆయనకు లైఫ్ అండ్ డెత్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఆయన 50కోట్లు ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సినిమా విడుదల లేటవుతూ వస్తోందని, ఫైనాన్షియర్స్ నుండి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కేవలం అనుష్క, రానాలను నమ్ముకుంటే ఈ చిత్రం బిజినెస్ జరగదని ముందే ఉహించిన ఆయన ఈ చిత్రంలోని గోనగన్నారెడ్డి పాత్రను అనేక మంది స్టార్ హీరోల చేత చేయించాలని ప్రయతించి చివరకు అల్లుఅర్జున్ నుండి స్నేహహస్తం అందుకున్నాడు. ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి గా బన్నీ క్యారెక్టర్ కేవలం 20 నుండి 30 నిమిషాల లోపే అని తెలుస్తోంది. అయినా బన్నీ లుక్స్ ను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ ఈ చిత్రం బిజినెస్ జరిగేలా ప్లాన్ చేస్తున్నప్పటికీ ఇటీవల చాలా భారీ చిత్రాల విషయంలో దెబ్బతిన్న బయ్యర్లు ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, చాలా తక్కువ ధరకు అడుగుతున్నారని సమాచారం. మరి బన్నీ గుణశేఖర్ ను గట్టెక్కిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది..! మరోవైపు గుర్రపుస్వారీ లో ఇప్పటికే మెగాభిమానులు 'మగధీర' చిత్రంలో రామ్ చరణ్ ను చూసి బాగా ఇంప్రెస్ అయి ఉన్నారు. మారి అంతటి క్రేజ్ గుర్రం ఎక్కినా మరో మెగా హీరో బన్నీ కి లభిస్తుందా? లేదా? అన్నది చూడాలి...!