మనిషన్నాక ప్రతీఒక్కరికీ ఏదో భయం ఉంటుంది. అయితే చాలామంది తమ భయాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇక సినిమా స్తార్లయితే ఇలాంటి వాటిని చాలా రహస్యంగా ఉంచుతారు. బయటకు తెలిస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడుతుంటారు. అయితే పవన్ కళ్యాన్ మాత్రం తనలోని భయాలను నిర్భయంగా బయట పెట్టాడు. సంక్రాంతి స్పెషల్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. నేను అత్యంత భయస్తుడిని, అందరిలాగే నాకు చాలా ఫోబియాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ లకు ప్రతిరోజు భయంగా వస్తుంటాను. పాటకు స్టెప్పులు వేయాలంటే భయం. ఫైటింగ్ సీన్లు చేసేటప్పుడు కూడా చాలా భయపడుతుంటాను. పైకి ఎగిరి దూకే సీన్లలో తాళ్ళతో నలుగురైదుగురు పట్టుకుంటారు. అన్ని జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఎవరైనా ఒకరు తాడు విడిచేస్తే ఎలా? అని మనసులో భయపడుతుంటాను.. అని చెప్పుకొచ్చాడు. 'గోపాల గోపాల' చిత్రంలో విశ్వరూపం సీన్ చేసే సమయం వచ్చినపుడు పవన్ చాలా భయపడ్డాడట. ఆ సీన్ చేయలేనని వెళ్ళిపోయిన విషయాన్ని కూడా పవన్ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. విశ్వరూపం సీన్ చేయడానికి తాను ప్రిపేర్ అయినప్పటికీ మనసులో ఏదో భయం వెంటాడింది. పదిరోజుల తర్వాత ఆ సీన్ చేసామని పవన్ తెలిపాడు.