పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడిగా నటించిన 'గోపాల గోపాల' చిత్రం మంచి హిట్ టాక్ తో దూసుకెలుతోంది. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కిషోర్ పార్ధసాని అలియాస్ డాలీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా డాలీ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి పవన్ గారు అందించిన సహకారం మరువలేనిది. ఆయన నాతో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. నేను దర్శకత్వం వహించే తదుపరి చిత్రం అదే అవుతుంది. మరో వారంలో స్టొరీ రెడీ చేసుకొని పవన్ గారికి వినిపిస్తాను. దేవుడి పాత్రలు అంటే స్వర్గీయ ఎన్టీఆర్ గారు కనిపిస్తారు. ఆయన సరసన పవన్ చేరాడు. దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఆయన మోడ్రన్ కృష్ణుడిగా అధ్బుతంగా నటించాడు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన మోములో ప్రసన్నత పరిధవిల్లుతోంది. ఆయన షూటింగ్ సమయంలో కేవలం ఆవుపాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తినేవారు.. అంటూ ఆకాశానికి ఎత్తేసారు. కాగా మూఢనమ్మకాలపై ఎక్కుపెట్టిన బాణంలా రూపొందిన ఈ చిత్రంలో పాలాభిషేకాలు చేసి పాలను వృధా చేయవద్దు.. ఆ పాలతో పేదల, భక్తులకు పాలు ఇస్తే బాగుంటుందనే విధంగా డైలాగ్ కుడా ఉంది. కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ చిత్రం విడుదల సందర్బంగా పవన్ కటౌట్లకి, పోస్టర్లకు పాలాభిషేకం చేయడంపై తీవ్ర విమర్శ చెలరేగుతోంది. మరి దీనికి పవన్ అంగీకారం లేనప్పటికీ పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పుకునే పవన్ అభిమానులు ఇలాంటి పైత్యపు పనులు వదిలిపెడితే బాగుంటుందనే మాట వినిపిస్తోంది.