ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ చిత్రం ప్రభంజనమే సృష్టిస్తుంది. కాగా త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందే చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కీలకపాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తెలుగులో మొదటిసారిగా వందకోట్లను అధిగమించే చిత్రం ఇదే కావచ్చనేది ఫిల్మ్ నగర్ సమాచారం. అంతేగాక ఇలాంటి చిత్రాలకు తెలుగుతో పాటు కోలీవుడ్ బాలీవుడ్ లలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ లో వర్కవుట్ అయితే సునామీ సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం మరేదో కాదు.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి. బేనర్ పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించనున్న 'బ్రహ్మోత్సవం' అని తెలుస్తోంది. 'పెదరాయుడు' తరహాలో ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ఉంటుందని, ఆ పాత్రను రజనీకాంత్ చేత చేయించాలని నిర్మాత దర్శకులు భావిస్తున్నారు. మహేష్ మీద ఉన్న అభిమానంతో పాటు పొట్లూరి ప్రసాద్ తో ఉన్న అనుబంధం రీత్యా ఈ పాత్రను రజనీకాంత్ చేయడం ఖాయమంటున్నారు. దీనికోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల త్వరలో రజనీని కలిసి పూర్తి స్టొరీని వినిపించనున్నాడని సమాచారం.