ఏపీలో రాజధాని కోసం భూముల సేకరణ వివాదమై కూర్చుంది. టీడీపీ వర్గాలు రైతులను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నాయని, ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చూస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి తగిన విధంగానే సాక్షి పత్రిక, సాక్షి చానళ్లలో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. అదే సమయంలో విజయవాడలో రాజధాని పెట్టడం ఇష్టం లేని జగన్ మోహన్‌రెడ్డి దాన్ని ఆపడానికి కుట్రలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే అసత్య కథనాలతో సాక్షి మీడియా రాజధాని ప్రాంతంలోని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోందని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. సాక్షి మీడియాలో వచ్చిన విధంగా తాము రాజధాని ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి వంద ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని, ఎకరా విలువ రూ. 15 కోట్లు ఉంటుందంటూ ఆధారాలు లేని కథనాలను ప్రచురించిందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తాము వంద ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీకి కేటాయించినట్లు ఎలాంటి ఆధారాలున్నా బయటపెట్టాలని చాలెంజ్ విసిరాడు. లేకపోతే రాజధాని ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు జగన్ ఒప్పుకోవాలన్నారు. మరి గాలి చాలెంజ్‌ను 'సాక్షి' స్వీకరిస్తుందా..?