తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళకూ స్థానం దక్కలేదు. కులాలు, మతాల సమీకరణాల్లో భాగంగా తెలంగాణలో అందుబాటులో ఉన్న 18 మంత్రి పదవులను పురుషులకే కేటాయించడంతో మహిళలకు మొండిచెయ్యి చూపినట్లైంది. దీంతో కేసీఆర్ సర్కారుపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ తన సర్కారులో మహిళలకు ప్రాధాన్యత పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఐఏఎస్ అధికారుల విభజన సందర్భంగా 24 మంది ఐఏఎస్ అధికారులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 5 జిల్లాలకు మహిళా ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా బదిలీల్లో హైదరాబాద్‌కు నిర్మల, వరంగల్‌కు కరుణ, ఆదిలాబాద్‌కు ప్రియదర్శిని, మహబూబ్‌నగర్‌కు శ్రీదేవి, కరీంనగర్‌కు నీతూకుమారి ప్రసాద్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రివర్గంలో మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యం కల్పించకున్నా.. కనీసం అధికారవర్గంలోనైనా ప్రాధాన్యత కల్పించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.