సీమాంధ్రకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి, అటు వారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. ఇటు వారికి సీఎం పదవి ఇవ్వాలన్న ఒప్పందంపైనే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అటు తర్వాత ఈ నియమానికి పార్టీలు కట్టుబడి ఉండకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర విభజనకు నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇదే రకమైన డిమాండ్ తెలంగాణలో కూడా వినబడుతోంది. పదవుల పరంగా దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఉత్తర తెలంగాణకు సీఎం పదవి దక్కితే దక్షిణ తెలంగాణకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దక్షిణ తెలంగాణపై ఉత్తర తెలంగాణ పెత్తనం పెరిగిపోయిందని నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే తెలంగాణలో కూడా మెల్లిగా ఉత్తర, దక్షిణ తెలంగాణాలంటూ ప్రాంతీయ భేదాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇక ఇవి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మరో ఉద్యమం వచ్చే అవకాశముంది. ఇప్పటికైనా కేసీఆర్ జాగ్రత్తపడకపోతే మరో కొత్త రాష్ట్రం డిమాండ్ వినబడకతప్పదేమో..!