ఎన్నికలకు ముందు బ్లాక్‌మనీపై బీజేపీ నాయకులు హామీల వర్షం కురిపించారు. ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల్లోగా బ్లాక్‌మనీని దేశంలోకి రప్పిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా.. ఈ దిశగా మోడీ సర్కారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అంతేకాకుండా ఇప్పుడు బ్లాక్‌మనీపై బీజేపీ నాయకుల స్వరం మారుతున్నట్లు కనబడుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బ్లాక్‌మనీ గురించి మాట్లాడుతూ.. నల్లధనాన్ని ఇప్పటికిప్పుడే దేశంలోకి రప్పించడం సాధ్యం కాదని చెప్పారు. అంతేకాకుండా నల్లధనం దాచిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు అడ్డు వస్తున్నాయని, నల్లధనాన్ని తిరిగి రప్పించడం చాలా కష్టంతో కూడాకున్న పని చెప్పారు. ఈ వ్యాఖ్యానాలను బట్టి బీజేపీ నాయకులు కూడా మెల్లిగా మాట తప్పే దారిలో వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇటీవలె మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 700 మంది నల్లకుబేరుల జాబితా సమర్పించిందని, నల్లధనంపై అలుపెరగని పోరు చేస్తోందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ 700 మంది పేర్ల జాబితాను కూడా గత యూపీఏ ప్రభుత్వమే సాధించిందని, కేవలం ఇప్పుడు ఆ పేర్లను సుప్రీంకోర్టుకు సమర్పించడమే బీజేపీ చేసిన పని అని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.