వివాహం తర్వాత సినిమాలు గ్యాప్ ఇచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి 'ఇంగ్లీష్..వింగ్లీష్' చిత్రంలో మరలా రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'పులి' చిత్రంలో కీలకపాత్రను పోషిస్తోంది. కాగా త్వరలో ఆమె తన భర్త బొనీకపూర్ నిర్మాతగా రూపొందే ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తోంది. అయితే శ్రీదేవి తన రీఎంట్రీ లో టాలీవుడ్ ను చిన్నచూపు చూస్తోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆమె చేత తమ చిత్రాలలో నటింపచేయాలని పలువురు సంప్రదించినప్పటికీ ఆమె రిజెక్ట్ చేసిందట. ఆమె కూతురును కూడా టాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇప్పించాలని కూడా పలువురు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఆమెకు సంబందించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. తెలుగు టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' లో కీలకమైన ఓ వేశ్యపాత్రను పోషించమని రాజమౌళి సినిమా ప్రారంభానికి ముందు శ్రీదేవిని సంప్రదించాడట. కానీ ఈ ఆఫర్ ను ఆమె తిరస్కరించడమే కాదు... అలాంటి పాత్రలు చేస్తే తన ఇమేజ్ దెబ్బతింటుందని రాజమౌళి పై కూడా ఆమె ఫైర్ అయిందని సమాచారం. మరి ఇది నిజమా? కాదా? అని తెలియాలంటే సోషల్ మీడియా లో ఎప్పుడు చురుగ్గా ఉండే రాజమౌళి స్పందన కోసం వేచిచుడాల్సివుంది...!