రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రాంతాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గింది. అటు కమ్మ, ఇటు వెలమ సామాజిక వర్గాలు అధికారంలో ఉండటంతో రెడ్ల ప్రభావం తగ్గిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రెడ్డి నాయకులు బలంగానే ఉన్నప్పటికీ రాష్ట్రా రాజకీయాల స్థాయికి సంబంధించి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కొంత బలహీనపడిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెడ్డి సామాజికవర్గాన్ని బలపర్చేందుకు ఆ వర్గం నాయకులు మీడియాపై దృష్టి సారించారు. సొంతంగా ఓ పత్రికను ప్రారంభించి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచేలా కృషి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న పత్రికల్లో రెండు కమ్మ సామాజిక వర్గం, ఒకటి వెలమ, ఒకటి రెడ్డి(సాక్షి) యాజమాన్యం ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. ఇందులో 'సాక్షి' అధినాయకుడు జగన్‌ను సీమ వ్యక్తిగానే పరిగణిస్తుండటంతో ఇక్కడ మరో పత్రికను తేవడానికి రెడ్డి నాయకులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా మూతబడటానికి సిద్ధంగా ఉన్న ఓ పత్రిక మిషనరీని కొనడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కూడా ఒకరు ఉన్నట్లు సమాచారం.