తెలుగు రాష్ట్రాల్లో అమిత్‌షా పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలు కొనసాగుతాయని ఆ పార్టీ నాయకులు భావించారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి తమ పార్టీలోకి భారీగా వలసలుంటాయనుకున్నారు. దీనికి తగిన విధంగానే ఏపీలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి తదితర నేతలు బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే చివరిక్షణంలో వారంతా వెనక్కితగ్గారు. తాము బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశారు. మరి రోజుల వ్యవధిలోనే వారంతా ఎందుకు నిర్ణయం మార్చుకున్నారనేది ఇప్పుడు అంతుచిక్కకుండా ఉంది. అయితే ఏపీలో చక్రం తిప్పుతున్న బీజేపీ ప్రధాన నాయకుడు పార్టీలో రెడ్డి సామాజిక వర్గం చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆయన నిర్ణయానికి తగిన విధంగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు కూడా తాము ఎవర్ని పార్టీలోకి ప్రత్యేకంగా ఆహ్వానించబోమని, వస్తామంటే వద్దని కూడా చెప్పమని ప్రకటించారు. ఈ ప్రకటన స్పష్టంగా బీజేపీలో ఆ నేతల చేరికను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలోనే ఆ నాయకులంతా బీజేపీలో చేరికపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బీజేపీలోకి వస్తామంటున్న నాయకులు సామాజికంగా, ఆర్థికంగా బలమైన నాయకులు కావడంతో వారి చేరిక పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయమై అమిత్‌షా ప్రత్యేక దృష్టిపెడితే ఆ నాయకులంతా బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.