జీహెచ్‌ఎంసీ ఎన్నికల పుణ్యమా అని కేసీఆర్ ఇప్పుడు నిజాంను ఆకాశానికెత్తేస్తున్నాడు. మా మంచి రాజు నిజాం అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నాడు. నిజాం హయాంలో జరిగిన అత్యాచారాలు, హత్యల గురించి కేసీఆర్ నోరు కూడా మెదపడం లేదు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో అసువులుబాసిన వీరుల వారసులు ఈ విషయమై కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు కూడా కేసీఆర్ వ్యాఖ్యానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు. ఇప్పుడు వీరికి విద్యావేత్తలు, మేధావులు కూడా తోడయ్యారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంను పొగడటం అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వేలాది మందిని కించపర్చడమేనని, వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు. నిజాం పాలన ఎలాంటిదో కేసీఆర్‌కు కూడా తెలుసునని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌ను ఇప్పుడు మేధావులు కూడా తప్పుబట్టడం ఆయన్ను ప్రజల్లో చులకన చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.