సునందా పుష్కర్ మృతి కొత్త మలుపు తీసుకుంది. ఆమెది సహజ మరణం కాదని, విషంతో ఆమె హత్యగావించబడిందని తేల్చిన ఢిల్లీ పోలీసులు ఈ కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటుచేశారు. గతేడాది జనవరి 17న ఢిల్లీలోని ఓ ఖరీదైన హోటల్‌లో సునందా పుష్కర్ విగతజీవిగా కనిపించింది. అయితే ఆమెది సహజ మరణమేనంటూ అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి కేంద్ర మంత్రి, ఆమె భర్త శశిథరూర్ ఒత్తిడి మేరకే పోలీసులు ఆమెది సహజ మరణంగా కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఆమె శరీరంపై దాదాపు 17 చోట్ల చిన్నచిన్న గాయాలుండటం ఈ ఆరోపణలను మరింత బలపర్చింది. ఇక బీజేపీ అధికారంలోకి రాగానే ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. సాధారణ పరీక్షల్లో తెలుసుకోలేని ఐసోటోపు విషపూరిత కణాలు ఆమె శరీరంలో లభించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు మరిన్ని పరీక్షల కోసం ఆ శ్యాంపుల్స్‌ను యూకే లేదా యూఎస్ పంపడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా సునందా పుష్కర్‌ది మర్డర్ అంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి శశిథరూర్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇవన్ని చూస్తుంటే శశిథరూర్‌కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.