ఏపీ ప్రభుత్వం జగన్‌కు ఊపిరిసలపనీయడం లేదు. అతడు ప్రభుత్వాన్ని ఏ విషయమై నిలదీసినా జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను అధికారపార్టీ సభ్యులు ముందుకుతీసుకొస్తున్నారు. ఇక రాజధాని భూసేకరణకు సంబంధించి కూడా అధికారపక్షం ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. రాజధాని భూసేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, టీడీపీ పెద్దలు రాజధాని చుట్టుపక్కల బినామీ పేర్లతో భూములు దక్కించుకోవడానికి చూస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ మాత్రం విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం ఇష్టంలేకే జగన్ అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, ఇడుపులపాయలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆయన అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారని వారు విమర్శిస్తున్నారు. దీంతో రాజధాని గురించి జగన్ గట్టిగా నిలదీసే అవకాశమే లేకుండాపోతోంది. దీనికిబదులుగా రాజధానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించినప్పుడే ప్రభుత్వాన్ని నిలదీయడం మేలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లు సమాచారం. అందుకే రాజధాని విషయంలో వైసీపీ నాయకులు ఆచుతూచి అడుగులు వేస్తున్నారు.