అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంపై అనేక వివాదాలు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. హిందూ సంస్థలతోపాటు పలు ముస్లిం సంస్థలు కూడా ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని ఆరోపిస్తున్నాయి. ఆ వివాదాలు అలా ఉంటే ఈ చిత్రం బాగుందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 'పీకే' చిత్రం విషయంలో నోరుజారాడు. సినిమాను డౌన్ లోడ్ చేసుకున్నానని, అయితే చూడటానికి సమయం చిక్కలేదంటూ సెలవిచ్చాడు. దీంతో ఆయన సినిమా పైరసీ కాపీ డౌన్ లోడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక పైరసీ గోల పక్కనపెడితే దర్శకుడు రాజ్ కుమార్, హిరానీ వివాదాల నేపధ్యంలో మీడియా ప్రకటన చేశాడు. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని, తాము అన్ని మతాలను, మత విశ్వాసాలను గౌరవిస్తామని తెలిపాడు. అమీర్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. సినిమా ప్రదర్శన కొనసాగుతుందని, ఎలాంటి సీన్లు తొలగించాల్సిన అవసరం లేదని సెంట్రల్ సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. సినిమా ఎవ్వరినీ కించపరిచే విధంగా లేదని, ఎలాంటి సీన్లు తొలగించడానికి బోర్డు సిద్ధంగా లేదని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లీలీ శాంసన్ చెప్పారు.