సోనియాగాంధీ అల్లుడిగా రాబర్ట్‌వాద్రా దేశవ్యాప్తంగా పెత్తనం చెలాయించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా.. సాగింది. ప్రధానంగా రియల్‌ఎస్టేట్‌వ్యాపారంపై దృష్టిపెట్టిన వాద్రాకు భూములు కట్టబెట్టడానికి ఆయా రాష్ట్రప్రభుత్వాలు క్యూ కట్టాయి. అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో వాద్రాను కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాజస్తాన్‌లో వాద్రాకు సంబంధించినదిగా చెబుతున్న భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. బినామీల పేరుతో అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేశారని దాదాపు 375 హెక్టార్ల భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే దీని గురించి స్పందించడానికి కాంగ్రెస్ నాయకులు ఇష్టపడటం లేదు. ఆ భూమితో రాబర్ట్‌వాద్రాకు ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. ఇక వాద్రాకు కౌంట్‌డౌన్ ఆరంభమైందని, ఆయన చేసిన అక్రమాలను వెలుగులోకి తెస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీన్నిబట్టి వాద్రాకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.