రెండు రాష్ట్రాల మధ్య ప్రతి విషయం వివాదానికి దారి తీస్తోంది. ఇరు రాష్ట్రాలు సర్దుకుపోయే ధోరణి ప్రదర్శించకుండా బెట్టు చేస్తుండటంతో చిన్నచిన్న సమస్యలు కూడా జటిలమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తలెత్తిన ఎంసెట్ వివాదం కూడా రెండు రాష్ట్రాల మధ్య పెను సమస్యగా మారింది. తాము ప్రత్యేకంగా ఎంసెట్ పరీక్ష నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుండగా ఇరు రాష్ట్రలకు కలిపే పరీక్ష నిర్వహించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి విషయం కావడంతో గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగారు. ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను రాజ్‌భవన్‌కు పిలిపించి సంధి చేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా ఆయన మూడు ప్రతిపాదనలను రెండు రాష్ట్రాల ముందు ఉంచారు. ఈ ఏడాది తెలంగాణ, వచ్చే ఏడాది ఆంధ్ర, ఆపై ఏడాది కేంద్రం చెప్పినట్లుగా నడుచుకోవాలని సూచించారు. రెండోది ఏడాదికొకరు చొప్పున ఎంసెట్ పరీక్ష నిర్వహించడం. అయితే మొదటి రెండింటికి కూడా తెలంగాణ అంగీకరించలేదు. ఇక మూడోది ఈ ఏడాదికి టీ-సర్కారు పరీక్ష నిర్వహించి, వచ్చే ఏడాది కేంద్రం చెప్పినట్లుగా నడుచుకోవాలన్న ప్రతిపాదనకు తెలంగాణ ఓకే చెప్పింది. అదే సమయంలో మొదటి రెండింటికి ఒప్పుకున్న ఏపీ మూడోదానికి అంగీకరించలేదు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలని గవర్నర్ సూచించారు. ఇక ఎంసెట్‌పై ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.