తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏదో ఓ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌ల్లో కొత్తకొత్త ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు చేయడం, సర్వేలు చేయడంలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. అయితే కేసీఆర్ రోజుకో ప్రాజెక్టును ప్రకటించడం వెనుక పెద్ద కసరత్తే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రియల్‌ఎస్టేస్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. దీంతో రిజిస్ట్రేసన్లు, స్టాంప్ డ్యూటీల రూపంలో ఖజానాకు చేరాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అయితే తాను ప్రకటించిన సంక్షేమ పథకాలన్ని అటకెక్కడం ఖాయమనుకున్న కేసీఆర్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. హైదరాబాద్ చుట్టూపక్కల ప్రాంతాల్లో హడావుడి చేస్తూ రియల్ వ్యాపారాన్ని మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఇక కేసీఆర్ చలువతో ప్రస్తుం రియల్‌వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గత ఏప్రిల్ రిజిస్ట్రేషన్ల రూపంలో రాష్ట్ర ఖజానాకు కేవలం రూ. 180 కోట్ల ఆదాయం వస్తే ఈ డిసెంబర్‌నాటికి అది రూ. 250 కోట్లను చేరింది. ముఖ్యంగా ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీ, యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తుల భూముల కొనుగోళ్లు విక్రయాలు జరుగుతుండటం కేసీఆర్ ఎత్తు ఫలించిందని చెప్పకనే చెబుతున్నాయి.