నిర్మాతగా సుధీర్గ అనుభవం ఉన్న నిర్మాత సి.కళ్యాణ్. గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్నప్పటికీ ఆయనకు వచ్చిన సక్సెస్ లు మాత్రం చాలా తక్కువే. ఇప్పటికీ ఆయన్ను అందరూ బిగ్రేడ్ నిర్మాతగానే పరిగణిస్తూవుంటారు. కాగా ఆయన కెరీర్ లో 'చందమామ' తరహా హిట్స్ ఒకటి రెండు ఉన్నప్పటికీ ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని 'చంద్రకళ' గా అనువదించి జాక్ పాట్ కొట్టాడు. కేవలం ఈ చిత్రానికి అయిన మొత్తం ఖర్చు 2 కోట్లు కూడా కాలేదు. కానీ శాటిలైట్ రైట్స్, ఇతరత్రా కలుపుకొని ఆయనకు నాలుగైదు కోట్లు వరకు వచ్చాయి. దీంతో ఆయన మరోసారి మరో తమిళ రీమేక్ ను తెలుగులో 'పిశాచి' టైటిల్ తో అనువదిస్తున్నాడు. మిస్కిన్ దర్శకత్వం లో తమిళ దర్శకుడు బాల నిర్మించిన ఈ చిత్రాన్ని ఆయన సి.కె. ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనువదిస్తున్నాడు. బాల ఈ చిత్రానికి సమర్పకుడు. ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ బిజినెస్ ప్రారంభం అయిందని సమాచారం. ఈ చిత్రం తో కూడా ఆయన మరోసారి జాక్ పాట్ కొట్టడం ఖాయమంటున్నారు.