లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న 'ఉత్తమవిలన్' చిత్రం రిలీజ్ ముస్తాబవుతోంది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తెయ్యమ్ కళాకారుడిగా, సినిమా సూపర్ స్టార్ గా రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై లింగుస్వామి నిర్మిస్తున్నాడు. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. ప్రముఖ కన్నడ నటుడు, కమల్ మిత్రుడు రమేష్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా ఇది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం లాస్ఏంజిల్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. జనవరిలో ఆడియో వేడుకను జరపనున్నారు. ఇటీవల కన్ను మూసిన గురువు, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని చూడాలని భావించిన ఆయన చివరి కోరిక నెరవేరకపోవడం దురదృష్టకరం. కాగా ఈ చిత్రాన్ని తన గురువుకు అంకితమిచ్చే యోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ కూడా కమలే అందిస్తుండడం విశేషం. 'ఉత్తమన్' అనే పాత్ర 8వ శతాబ్దానికి డ్రామా ఆర్టిస్ట్ దని , ఇక మనోరంజన్ అనే మరోపాత్ర 21వ శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్రని సమాచారం. కమల్ తో పాటు ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన నలుగురు సూపర్ స్టార్స్ కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం బాగా ఆడితే తన 'విశ్వరూపం 2' చిత్రానికి మరలా బిసినెస్ క్రేజ్ వస్తుందనే ఆశతో కమల్ ఉన్నాడు.