సాధారణంగా ఇక్కడ రిలీజ్ అయి హిట్ అయితే మరో భాషలోకి రీమేక్ ప్లాన్ చేస్తారు. అయితే ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ మాత్రం తన చిత్రం మీద ఉన్న నమ్మకంతో తెలుగులో తాను చేస్తున్న రీమేక్ ని వెంటనే హిందీలోకి కూడా రీమేక్ చేస్తానంటున్నాడు. మరి ఇది సినిమా మీద ఉన్న నమ్మకమా? లేక పబ్లిసిటీ స్టంటా? అనే విషయంపై ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. ఆ చిత్రం మరేదో కాదు... రామలక్ష్మి సినీ క్రేయేషన్స్ పతాకంపై సుధీర్ బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ రూపొందిస్తున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' . ఈ చిత్రాన్ని తమ బేనర్ లోనే హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా చేయడానికి సన్నాహాలు చేస్తునారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం కన్నడలో వచ్చిన 'చార్మినార్' చిత్రానికి రీమేక్. కన్నడలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రునే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ తెలుగులో వచ్చిన 'మరోచరిత్ర', హిందీలో వచ్చిన 'మైనే ప్యార్ కియా' చిత్రాలతో పోలుస్తున్నాడు.