తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటుడుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పబడిన అక్కినేని జాతీయ అవార్డును బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కి అందించారు. ఈ అవార్డులో భాగంగా ఐదు లక్షల రూపాయలను చెక్‌ను అమితాబ్‌కి కెేసీఆర్ అందించారు. వెంకయ్యనాయుడు అమితాబ్ బచ్చన్‌ని శాలువాతో సన్మానించారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం డిసెంబర్ 27, శనివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు, అక్కినేని అవార్డు కమిటీ ఛైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి, అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, శ్రీమతి నాగసుశీల, మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, కృష్ణంరాజు, బహ్మానందం, అక్కినేని నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సమంత్, డి.సురేష్ బాబు, రానా, సమంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ‘‘అద్భుతమైన నటనా కౌశలంతో తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన మహానటుడు ఏఎన్నార్‌గారు. నా చేతుల మీదుగా ఆయన పేరు మీదున్న అవార్డుని అందించడం చాలా హ్యపీగా ఉంది. సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం అక్కినేని నాగేశ్వరావుగారే. ఇది చారిత్రక సత్యం. హైదరాబాద్‌లో బేగంపేటలో నివాసముంటూ నిర్మాతలను ఇక్కడికి పిలిపించేవారు. అలా నెమ్మదిగా సినిమా పరిశ్రమ ఇక్కడ స్థిరపడిరది. ఇటీవల రామోజీరావుగారిని కలిశాను. రామోజీఫిలిం సిటీని నిర్మించి ఓ అద్భుతాన్ని సృష్టించారు. రామోజీ ఫిలిమ్ సిటీలోనే ఏడాదికి 200కి పైగా చిత్రాలు నిర్మిస్తారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అలాగే ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవిగారిని కలుసుకున్నప్పుడు సినిమా పరిశ్రమ గురించే మాట్లాడుకున్నాం. త్వరలోనే సినీ ప్రముఖులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ సినిమా పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అందుకనే సినిమా పరిశ్రమకి దగ్గర అనుబంధం ఉండే తలసాని శ్రీనివాస యాదవ్‌ను సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించాం. సినిమా రంగంపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి సారించి మంచి సపోర్ట్‌ను ఇస్తుంది. అమితాబ్ బచ్చన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన, జయా బచ్చన్‌గారు కలిసి నటించిన అభిమాన్ సినిమాని ఇప్పటికి 50సార్లు చూశాను. నేను ఇప్పటి వరకు ఎక్కువసార్లు చూసిన సినిమా అదే. 70 ఏళ్ల వయస్సు అవుతున్నా ఆయన క్రేజ్, పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏర్పాటు చేసిన అవార్డుని మరో పద్మభూషణ్ అవార్డు గ్రహీతకి నా చేతుల మీదుగా అందించడం నేను ఉహించలేదు, ఆనందంగా ఉంది’’ అన్నారు.
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ‘‘అక్కినేని అవార్డుని స్వీకరించడం ఆనందంగా ఉంది. 50, 60 సంవత్సరాలు క్రితం పిల్లలు సినిమాలు చూడాలంటే ముందు తల్లిదండ్రులు చూసి, చూడదగినది అనిపిస్తేనే పిల్లలకు చూపించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే అందరికీ గౌరవ మర్యాదలు పెరిగాయి. సినిమాను ప్యారలల్ కల్చర్‌గా భావిస్తున్నారు. నాగేశ్వరరావుగారితో ఎన్నో మరపురాని క్షణాలను గడిపాను. ఆయన గొప్ప నటుడు. అంతకన్నా గొప్పగా సింపుల్ జీవితాన్ని గడిపేవారు. తన ఉన్నతికి కారణమైన సినిమాకి ఏదైనా చేయాలనుకుని చాలా కార్యక్రమాలను చేసిన వ్యక్తి. సినిమాలో చాలా మంది సోషల్ ఆక్టివిటీస్‌లో భాగంగా ఉన్నారు. అలాగే నేను కూడా పోలియో రహిత సమాజం కోసం పోరాడాను. అలాగే ప్రస్తుతం టీబీ గురించి ప్రచారం చేస్తున్నాను. ఇది నయం చేయగల వ్యాధే. నాకు కూడా 15ఏళ్ల క్రితం టీబీ సోకింది. ఇక కెసీఆర్‌గారికి నా ముఖం, నా పనితో ఏదైనా అవసరం అనుకుంటే కచ్చితంగా నా వీలైనంత సహాయం చేస్తాను. అలాగే ప్రధాని చేస్తున్న స్వచ్ఛ భారత్ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో హిందీలో కంటే ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నారు. వరల్డ్‌వైడ్‌గా హ్యూజ్ బిజినెస్ చేస్తున్నాయి. తండ్రి పేరు నిలబెట్టేవారే నిజమైన వారసులని మా నాన్నగారి అభిప్రాయం. అక్కినేని వెంకట్, నాగార్జున, ఇతర కుటుంబసభ్యులు... అక్కినేని పేరుని నిలబెడుతున్నారు’’ అన్నారు.
టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘ తెలుగు చిత్రసీమలో గొప్పనటుడిగా నిలిచిపోయిన అక్కినేని నాగేశ్వరరావుగారు తన అభినయంతో మన గుండెల్లో నిలిచిపోయారు. 50 సంవత్సరాల నుండి ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. రెండు లక్షలతో స్టార్ట్ చేసిన అవార్డు ఇది. కానీ బ్యాంకులో కోటి రూపాయలను జమ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పుడు రూ.5లక్షలను ఈ అవార్డు గ్రహీతలకు అందిస్తున్నాం. అక్కినేని కుటుంబ సభ్యులైన వెంకట్, నాగార్జున, సుశీల ఆయన కోరికను నేరవేరుస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌ను పొగడాలంటే అడ్జెక్టివ్స్ సరిపోవు. లండన్ మ్యూజియంలో మైనపుబొమ్మ ఏర్పాటైన తొలి ఆసియా నటుడు ఆయన. బిబిసి వారు కండెక్ట్ చేసిన మిలీనియం స్టార్ అవార్డుని కూడా అందుకున్న తొలి హీరో ఆయనే. ఆయనకి ఈ అవార్డు రావడం, స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘‘తన జీవిత కాలం నటనలో జీవిస్తూ, మనల్ని ఆనందింపచేసిన మహానటుడు ఏఎన్నార్. భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సినిమాలతో మన గుండెల్లో నిలిచిపోయారు. ఒక మహానటుడికి ఇచ్చే అవార్డుని మరో మహానటుడి అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రామం నుండి వచ్చిన అక్కినేని అంచెలంచెలుగా ఎదిగారు. యావత్ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతే ఎవరైనా. అక్కినేనిగారు తెలుగు సినిమాలో సాధించని రికార్డులు లేవు, అవార్డులు లేవు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న నటుడు. తెలుగు సినిమా చరిత్రకు నిఘంటువు అని చెప్పడం అతిశయోక్తి కాదు. నటనలో ఏఎన్నార్ ఒక బెంచ్ మార్కుని క్రియేట్ చేశారు. అలాగే హిందీలో కూడా అమితాబ్ బచ్చన్‌గారు నటనలో ఒక బెంచ్ మార్కుని క్రియేట్ చేశారు. సమాజంలో ప్రతిభని గుర్తించి సన్మానిస్తే మనల్ని మనమే గౌరవించుకున్నట్టు అవుతుందనే భావంతోనే ఏఎన్నార్‌గారు ఈ అవార్డుని పెట్టారు. ఈ అవార్డు అమితాబ్‌కి దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘ఈ అవార్డుని కంటిన్యూ చేయమని నాన్నగారు మా దగ్గర మాట తీసుకున్నారు. ఆయన మాట నిలబెట్టినందుకు ఆనందపడాలో లేక ఆయన మన మధ్య, వేదికపైన లేనందుకు బాధపడాలో తెలియడం లేదు. అద్భుతంగా నటించే అమితాబ్‌గారు, అనుకున్నది సాధించే కెేసీఆర్‌గారికి థాంక్స్. ఆయన పరిపాలనలో తెలంగాణా బంగారు తెలంగాణా అవుతుంది. నేను సినిమాల్లో రావాలనుకోగానే అమితాబ్ బచ్చన్ సినిమాలు చూడమని నాన్నగారు అన్నారు. అలాగే నా పిల్లలు కూడా సినిమాల్లోకి రావాలనగానే అమితాబ్ సినిమాలే చూడమన్నారు. ఆయన అమితాబ్‌గారు చేసిన ప్రతి చిన్న ఫీలింగ్‌ను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. ఆయన చనిపోయే 30 రోజుల ముందు వరకు కూడా అమితాబ్ సినిమాలనే ఎక్కువగా చూశారు. అలా అమితాబ్‌గారు నాన్నగారిని ఎంటర్‌టైన్ చేశారు. అలాగే నాన్నగారు నటించిన చివరి చిత్రం మనం కూడా అమితాబ్‌గారు నటించారు. అందుకు అమితాబ్‌గారికి థాంక్స్. నిజంగా ఏఎన్నార్ లివ్స్ ఆన్...’’ అన్నారు.