గామా అవార్డులు (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్) 2014లో ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 31 న జరిగిన గామ అవార్డ్స్ కార్యక్రమంలో 2013వ సంవత్సరానికి సంబంధించిన మ్యూజికల్ అవార్డ్స్ తో పాటు ఈ వేదికపై ప్రముఖ దర్శకులు బాపు గారికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్న ఈ వేడుక దుబాయ్ లోని ప్రవాసాంధ్రులను అలరించింది. ఈ వేదికపై పలువురు గాయనీ గాయకులు తమ ఆట, పాటలతో దుబాయ్ లోని తెలుగువారిని అలరించారు. మరో రెండు నెలల్లో 2014 ఏడాదికి సంబంధించిన గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ (గామా) వేడుక జరగనుంది.
2014వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన 'గామా అవార్డు'ల ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్ లో జరగనుంది. తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ ను ఈ వేదికపై జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నామని అవార్డు వేడుకల చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. గత వేడుకకన్నా ఈసారి మరింత వైభవంగా ఈ అవార్డుల వేడుకను జరపనున్నామని ఆయన చెప్పారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు,సంగీత దర్శకులు, పాటల రచయితలు, కళాకారులు పాల్గొనబోతున్న ఈ వేడుక దుబాయ్ లోని తెలుగువారికి కనుల పండువ అవుతుందని కూడా త్రిమూర్తులు అన్నారు.