పోస్ట్-ప్రొడక్షన్ కోసం బిగ్ ప్లాన్!
Welcome to the Jungle Gets a Big Post-Production Plan
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం `వెల్కమ్ టు ది జంగిల్` (వెల్కమ్ 3) నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ వ్యవహారాల కోసం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న జ్యోతి దేశ్‌పాండేకి చెందిన ఫిరోజ్ నడియాడ్‌వాలా అండ్ టీమ్-జియో స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ ముంబైలోని వ్యాపార కేంద్రమైన అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఆఫీస్ స్పేస్‌ను భారీ మొత్తానికి లీజుకు తీసుకుంది. నివేదికల ప్రకారం ఈ లీజు విలువ సుమారు 2.46 కోట్లుగా నమోదైంది.
భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ పోస్ట్-ప్రొడక్షన్, మార్కెటింగ్, ఇతర ఆఫీస్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికే నూతన ఆఫీస్ ను లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగానికి - బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లకు అంధేరి వెస్ట్ ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ లీజు డీల్ కోసం సదరు ప్రొడక్షన్ హౌస్ స్టాంప్ డ్యూటీ - రిజిస్ట్రేషన్ రుసుములను చెల్లించినట్లు తెలుస్తోంది.
అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న `వెల్కమ్ టు ది జంగిల్` చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సంజయ్ దత్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా భారీ నటీనటులు నటిస్తున్నారు. ఈ భారీ సినిమా నిర్మాణ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకోగా... మరికొన్ని రోజుల్లో పోస్ట్-ప్రొడక్షన్ పనులను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసేందుకు కొత్త ఆఫీస్ స్పేస్ వేదిక కానుంది.







































