కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆశలన్నీ కాకా పైనే!
KVN Productions Is Banking Big on Kaaka
దక్షిణాది చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో శరవేగంగా గుర్తింపు పొందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. వందల కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించిన పాన్-ఇండియా ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన `జననాయగన్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల వసూళ్లను రాబట్టినా? ఆ సినిమాపై జరిగిన మైండ్ బ్లాకింగ్ థియేట్రికల్ బిజినెస్ కారణంగా అంతిమంగా నష్టాలను మిగిల్చి వాణిజ్యపరంగా ప్లాప్‌గా నిలిచింది.
మరోవైపు కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `టాక్సిక్` కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. `కెజిఎఫ్` శ్రేణి చిత్రాల తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడం..500 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్లోబల్ స్కేల్లో రూపొందించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే కంటెంట్ విషయంలో ప్రేక్షకాదరణ పొందలేకపోవడంతో సినిమా సాధించిన పరాజయం కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆర్థిక గణాంకాలను.. బ్రాండ్ మార్కెట్‌ను దెబ్బతీసింది.
వరుసగా రెండు భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులు పరాజయం పాలవ్వడంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న `కాకా` చిత్రంపైనే పెట్టుకుంది. గతంలో ఇద్దరి కలయికలో వచ్చిన `వాల్తేరు వీరయ్య` బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లతో సంచలన విజయం సాధించడంతో ఈ కాంబో రీ-యూనియన్‌పై ట్రేడ్ వర్గాల్లో ..అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి రేసులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు పక్కా ప్లానింగ్‌తో ముందుకుసాగుతున్నారు.
పాన్-ఇండియా సరిహద్దుల మోజులో పడి భారీ బడ్జెట్లతో రిస్క్ చేయడం కంటే పక్కా కమర్షియల్ మాస్ అంశాలు.. బలమైన రీజనల్ సెంటిమెంట్ ఉన్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే నమ్మకంతో `కాకా`ను కేవీఎన్ సంస్థ నిర్మిస్తోంది. `జననాయగన్`.. `టాక్సిక్` చిత్రాలు ఇచ్చిన దెబ్బ నుంచి కోలుకోవాలన్నా? సంస్థ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలన్నా? చిరంజీవి `కాకా` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో రికార్డులు కొట్టడం ఆవశ్యకంగా మారింది. మరి సంక్రాంతి బరిలో వస్తున్న మెగా మాస్ ఎంటర్టైనర్ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ను ఎంతవరకు ఒడ్డున వేస్తుందో చూడాలి.















































