టాక్సిక్ బిజినెస్ జోరు కాక పుట్టిస్తోందే!

Toxic Business Mania Is Heating Up

 

కన్నడ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన `కేజీఎఫ్` సిరీస్ తర్వాత హీరో యష్ న‌టిస్తోన్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్`. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాఖీ భాయ్‌గా బాక్స్ ఆఫీస్‌ను శాసించిన యష్ ఈబ‌సారిబ‌కూడా అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తూ భారతీయ సినిమా చరిత్రలో కొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది.

ఇండియన్ సినిమా రంగాన్ని ఆశ్చర్యపరిచేలా `టాక్సిక్` ప్రీ-రిలీజ్ బిజినెస్ అత్యున్నత స్థాయిలో జరుగుతోంది.  ఓవర్సీస్ మార్కెట్‌లోనే ఈ చిత్రం  105 కోట్ల మేర‌ బిజినెస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల వరకు ప్రీ-రిలీజ్ వ్యాపారం జరుగుతుండగా.. హిందీ మార్కెట్‌లో  అంచనాలు ఏకంగా  180 కోట్లకు పైగా పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో జరుగుతున్న  వాణిజ్య లావాదేవీలతో యష్‌ మార్కెట్ స్టామినా ఏంటో? మరోసారి రుజువవుతోంది.

ఈ భారీ వ్యాపార ధోరణితో `టాక్సిక్`  సరికొత్త రికార్డుల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇప్పటివరకు అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రాల సరసన నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `ఆర్ఆర్ఆర్`  సినిమాను దాటి,  `పుష్ప 2` తర్వాత అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా టాక్సిక్ చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం  వంద‌ల‌ కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి  అంచనాల నడుమ వస్తున్న `టాక్సిక్`  విడుదల తర్వాత ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Toxic Business Dealings Are Turning Heads