ప్రేమకు జై మూవీ రివ్యూ
సాంకేతికంగా ప్రపంచం ఎంత అభివృద్ధి సాధిస్తున్నా కూడా ఇంకా కులాల ముసుగులో హత్యలు జరుగుతుండటంతో సమాజం సిగ్గుతో తల దించుకుంటోంది. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకోవాలనుకున్న లేదా చేసుకున్న యువతీ యువకులు ఏటా వేలాది మంది దారుణ హత్యలకు గురవుతున్న ఘటనలు నివ్వెరపుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో నిత్యం ఎక్కడోచోట పరువు హత్యలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ పరువు హత్యల నేపథ్యంలో అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన చిత్రం ప్రేమకు జై. ఈ సినిమా తాజాగా థియేటర్‌లలో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
చిరంజీవి అభిమాని జై హీరో కావాలని కలలు కంటాడు. తన గ్రామానికి చెందిన ప్రేమ అనే అమ్మాయితో లవ్‌లో ఉంటాడు. అయితే ప్రేమ తండ్రి నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. తనను తాను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్న జై, జీవితంలో విజయం సాధించి, ప్రేమను వివాహం చేసుకోవడానికి తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు, సామాజిక నిబంధనలను, అంచనాలను సవాలు చేస్తాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న జై, ఊరిలో ఉన్న ప్రేమ ఒకేసారి విగతజీవులవుతారు. ఇంతకీ ఏం జరుగుతుంది? ఈ ఘటనకు కారణమేంటో తెలుసుకోవాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
హీరోగా నటించిన అనిల్ బురగాని తన పాత్రలో చక్కగా నటించాడు. హీరోగా మంచి కెరీర్ ఉందని ఈ సినిమా ద్వారా ఫ్రూవ్ చేసుకున్నాడు. పాటల్లో, డాన్స్‌లో, ఫైటింగ్ సీన్లలో బాగా చేశాడు. ఇక హీరోయిన్ జ్వలిత చాలా క్యూట్‌గా ఉంది. నాచురల్‌గా నటించింది. ఇక విలన్ పాత్రలో భాస్కర్ దుబ్బాక యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. తన టాలెంట్‌తో సినిమా రేంజ్‌ను మరింతా పెంచాడు. ఇక ఆనంద్, సద్దామ్, మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ పరంగా చూస్తే సినిమాటోగ్రఫి చక్కగా కుదిరింది. ఉరుకుందా రెడ్డి ప్రతి సీన్‌ను చాలా నాచురల్‌గా చిత్రీకరించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మ్యూజిక్ చెప్పుకోవచ్చు. పాటలు యువతకు నచ్చే విధంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లకు తగ్గట్టే బాగుంది. సామ్రాట్ అందించిన ఎడిటింగ్ పరవాలేదు. అక్కడక్కడ కొన్ని కట్ చేస్తే ఇంకా బాగుంటుందనిపిస్తుంది. క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత అనసూర్య నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
నిజానికి పరువు పేరుతో చేసే హత్యలవల్ల పరువు దక్కుతుంది అనుకోవడం అజ్ఞానం, హంతకులు అనే ముద్ర పడటంవల్ల పరువు పోతుందని ఎందుకు ఆలోచించరు? అంటూ డైరెక్టర్ శ్రీనివాస్ మల్లం ఈ సినిమా తెరకెక్కించారు. తాను అనుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ తరం యువత, వారి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన చిత్రం ఇది.
రేటింగ్ - 2/5