ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో హరి హర వీరమల్లు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినీ అభిమానులంతా ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు, ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నారు మరియు విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ఈ వేసవిలో వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.
దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ గత ఏడు నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్ మొదలుకొని మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడం వరకు ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చేయడంలో జ్యోతి కృష్ణ పాత్ర కీలకం.
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు.
హరి హర వీరమల్లు చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. .