మన తెలుగు తెర అగ్ర తారలు
ఊపు మీదే ఉన్నారు కానీ
ఉరకలు కరువయ్యాయి.
వారి రాబోయే చిత్రాలపై
అభిమానుల్లో ఉత్సుకత ఉంది కానీ
ఉత్సాహం సన్నగిల్లుతోంది.
ఎందుకిలా అంటే....
టాలీవుడ్‌లో ఒకే ఏడాది డజను సినిమాల్లో నటించి రిలీజ్ చేసిన హీరోలు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఒకే రోజు మూడు కాల్షీట్లలో మూడు సినిమాలు పూర్తి చేసేవారు. ఒకే ఏడాది ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయిన ఘనత ఆయనది. విశ్వ విఖ్యాత నవరస నటసార్వభౌముడు ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ వంటి ఆల్ టైమ్ క్లాసిక్ ని మూడు పాత్రలు (కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా) చేస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తూ 45 రోజుల్లో పూర్తి చేసిన సాటి లేని మేటి సినిమా మేకర్. శోభన్ బాబు నుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాలొచ్చాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు తక్కువ సమయంలో ఎలా సినిమాలు పూర్తి చేయాలో ఇండస్ట్రీకి నేర్పారు. కానీ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల మేకింగ్ శైలి అనూహ్యంగా మారిపోయింది. భారీ కాస్టింగ్, అసాధారణ సాంకేతికతను ఉపయోగిస్తూ కూడా షూటింగ్ అంతకంతకు డిలే చేస్తున్నారు. భారీ కాంబినేషన్లతో పెద్ద సినిమాలను ఘనంగా ప్రకటించేస్తున్నారు. కానీ వీటి రిలీజ్ ఎప్పుడు? అన్నదే సందిగ్ధంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఎప్పుడో మొదలైంది. ఫాంటసీ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ సినిమాకి బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పటికి వస్తుందో ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మెగా బాస్ నటించిన చివరి ఫ్లాప్ సినిమా భోళాశంకర్ విడుదలై చాలా కాలమే అయింది. అందువల్ల ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. ఇక ఇటీవలే ప్రకటించిన మెగా 157 కి దర్శకుడు అనిల్ రావిపూడి కనుక వేగంగా పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందు పెడతాడని నమ్మొచ్చు కానీ, ఆపై శ్రీకాంత్ ఓదెల సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో ఊహించలేం.
నటసింహా నందమూరి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఎప్పుడొస్తుందో నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. దర్శక, నిర్మాతలు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఇక సూపర్ స్టార్ మహేష్ - రాజమౌళి సినిమా గురించి ప్రస్థావించాల్సిన పనే లేదు. అది ఎప్పటికి వస్తుందో రాజమౌళికే తెలీదు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి షిఫ్ట్ అయ్యి, హాలీవుడ్ రేంజులో రిలీజ్ చేయాలని భావిస్తున్నందున ఈ సినిమా సాంకేతికంగా నెవ్వర్ బిఫోర్ అనేలా తెరకెక్కాల్సి ఉంది. అందువల్ల రిలీజ్ డేట్ గురించి జక్కన్నను కూడా ఎవరూ అడగకూడదు! ప్రస్తుతం ఒరిస్సా అడవులు సహా పలు ఎగ్జోటిక్ లొకేషన్లలో ప్రధాన తారాగణంపై రాజమౌళి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. అగ్రనిర్మాత కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నాడు. మారుతితో రాజా సాబ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. హను రాఘవపూడితో ఫౌజీ ఎక్కడ వరకూ వచ్చిందో తెలీదు. ఇక ప్రశాంత్ నీల్ తో సలార్ 2 (శౌర్యంగఫర్వం) చిత్రీకరణ ప్రారంభమైనా కానీ, అది ఎప్పటికి రిలీజ్ తేదీని ప్రకటిస్తారో అస్సలు క్లారిటీ లేదు. సందీప్ వంగా స్పిరిట్ ఎప్పటికి సెట్స్ కెళుతుందో ఇంకా స్పష్ఠత లేదు. నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి సీక్వెల్ పైనా చాలా సందిగ్ధతలు ఉన్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలతో ప్రభాస్ గందరగోళంలో ఉన్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు.
ఉప్పెన బుచ్చిబాబుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ప్రారంభమై ఏడాది పైగానే అయింది. బుచ్చిబాబు ఈ క్రీడా నేపథ్య చిత్రాన్ని ఉలి వేసి చెక్కుతున్నాడు. నిన్ననే వచ్చే ఏడాది 27 మార్చ్ 2026 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ అది జరుగుద్దా, లేకుంటే రామ్ చరణ్ గత చిత్రాల్లానే పోస్ట్ పోన్ అవుతూ పోద్దా అనేది అభిమానుల సందేహం. ఇక ఆపై చరణ్ చేయనున్న సుకుమార్ చిత్రం అయితే ఎన్నేళ్లు సాగుతుందో చెప్పనే లేము. ఎందుకంటే సుక్కు మాస్టర్ చెక్కుడు అందరికీ తెలిసిందే కదా!
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస చిత్రాల కోసం సన్నాహకాల్లో ఉన్నాడు. త్రివిక్రమ్ తో భారీ చిత్రాన్ని ప్రకటించినా దానిపై సరైన స్పష్ఠత లేదు. అలాగే అట్లీతో సినిమాని ప్రారంభిస్తాడని చెబుతున్నా, ఇది ఎప్పుడు మొదలై ఎప్పటికి పూర్తవుతుంది? అనే డైలమా అలానే ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 డేట్ వచ్చినా ప్రశాంత్ నీల్ తో భారీ చిత్రాన్ని ఎప్పటికి పూర్తి చేస్తాడో క్లారిటీ లేదు. కొరటాల శివతో దేవర 2 ఎప్పటికి మొదలవుతుంది? ఎప్పుడొస్తుంది? అన్నదానిపైనా సరైన స్పష్ఠత లేదు. దేవర 2 చేస్తానని ఎన్టీఆర్ ప్రకటించినా కానీ, పూర్తి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. అలాగే నెల్సన్ డైరెక్షన్ లో తారక్ హీరోగా నాగవంశీ నిర్మించనున్న సినిమా ప్రకటన రావాల్సి ఉంది. ప్రారంభం కావాల్సి ఉంది. అది ఎప్పటికి థియేటర్లలో దిగుతుందో వేచి చూడాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఖుషి లాంటి యావరేజ్ ని అందించాడు. కానీ అతడు కింగ్ డమ్ రిలీజ్ ని అంతకంతకు ఆలస్యం చేస్తుంటే అభిమానులు నిరాశగా వేచి చూస్తున్నారు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నా, డిలే ఇబ్బందికరంగా మారింది.
నేచురల్ స్టార్ నాని ఒకేసారి హీరోగా, నిర్మాతగా కొనసాగుతూ తాను నటించిన సినిమాలకు రిలీజ్ డేట్‌ని దూరం చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. నాని ప్రస్తుతం హిట్ 3లో నటిస్తున్నాడు. ఈ చిత్రం మేలో వస్తుందని చెబుతున్నా మరింత స్పష్ఠత రావాల్సి ఉంది. తదుపరి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ ని ప్రారంభిస్తాడు. మ్యాడ్ మ్యాక్స్ లాంటి వెరైటీ చిత్రమిదని ప్రచారం సాగుతోంది. అయితే తన సినిమాల రిలీజ్ తేదీల విషయంలో నాని మరింత స్పష్ఠంగా క్లారిటీనివ్వాల్సి ఉంది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సంబరాలు ఏటిగట్టు అంటూ అదిరే టైటిల్ తో సినిమా తీస్తున్నాడు కానీ రిలీజ్ తేదీ విషయమే అస్సలు చెప్పడం లేదు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో రూపొందిస్తున్న ఈ సినిమా కాన్వాస్ చాలా పెద్దది. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు, చరిత్ర నేపథ్యంలో సినిమా కాబట్టి పెద్ద బడ్జెట్ పెడుతున్నారు. దీంతో ఇది డిలే అవుతోంది. షూటింగ్ అలా అలా సాగుతోంది. థియేటర్లలోకి ఎప్పటికొస్తుందో తెలీని పరిస్థితి.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు- సినిమాలు అంటూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. వరుసగా మూడు సినిమాలు చేస్తున్నా ఏవీ రిలీజ్ కి రావడం లేదు. ప్రకటనలు ఘనంగా ఉన్నా రిలీజ్ జీరో అన్న అసంతృప్తి నెలకొంది. ఎప్పుడో ప్రారంభించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని ఇప్పటికి పూర్తి చేసి రిలీజ్ కి తెస్తున్నామని చెబుతున్నా జనం నమ్మలేకపోతున్నారు. మే లో వీరమల్లు ఆగమనం గురించి వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ మూవీ థియేటర్లలోకి వచ్చాకే వచ్చిందని చెప్పాలి. సుజీత్ - ఓజీ కి మోక్షం ఎప్పటికో తెలియదు. హరీష్ శంకర్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అస్సలు అస్సలు ఊసే లేదు!
ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ లో అన్ని భాషల నుంచి స్టార్లను ఎంపిక చేస్తూ, భారీ తారాగణంతో అసాధారణంగా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు. సాంకేతికంగాను హాలీవుడ్ టెక్నీషియన్లను బరిలో దించుతున్నారు. దీంతో మేకింగ్ సమయం, బడ్జెట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సిన దుస్థితి. మన స్టార్ల సినిమాల రిలీజ్ ల డిలే వెనక చాలా కారణాలు ఉన్నాయి.
ఈ ఇద్దరినీ చూడండి గురూ !
అయితే కేవలం 72రోజుల్లో యానిమల్ సినిమా తీసాడు సందీప్ వంగా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 800కోట్లు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కేవలం రెండు నెలల్లో సంక్రాంతికి వస్తున్నాం తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావిపూడి. దాదాపు 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. అయితే ఆ ఇద్దరిలా మ్యాజిక్ చేయడం ఇతర దర్శకులకు ఎందుకు సాధ్యపడటం లేదో కాస్త విశ్లేషించుకోవాలి సుమీ!
-Parvathaneni Rambabu✍️