విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్య వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యంగా విద్యార్థులపై ఉన్న విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించాలనే సంకల్పంతో వారంలో ఒక రోజుని నో బ్యాగ్ డే గా ప్రకటించారు. విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతి నెల మూడో శనివారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు.
కానీ ఇప్పటి నుంచి 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు ప్రతి శనివారం పాఠశాలలకు బ్యాగులు తీసుకు రావాల్సిన అవసరం లేదు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అనే మహోన్నత లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని మంత్రి నారా లోకేష్ ధృడ సంకల్పంతో ఇలాంటి ఉన్నత నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. లోకేష్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ నో బ్యాగ్ డేలో విద్యార్థుల కోసం అనేక ఆసక్తిక కార్యకలాపాలను రూపొందించారు.
అందులో భాగంగా క్విజ్‌లు, సెమినార్లు, డిబేట్స్, ఆతల పోటీల ద్వారా విద్యార్థులలో క్రియేటివిటి, గ్రూప్ ఇంటర్వ్యూ, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించనున్నారు. ఆయన ఆరు నెలల సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా రూపొందించబడిన ఈ నో బ్యాగ్ డే కార్యక్రమం స్కిల్ టెస్టులు, క్లబ్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పెల్ బీ కాంపిటేషన్, లలిత కళలు మరెన్నో కార్యకలాపాల ద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఉద్దేశించారు. పాఠశాల విద్యలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు ఇప్పటికే ఆశాజనకమైన ఫలితాలను అందిస్తున్నాయి.