ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సీఎం పెళ్లాం. ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం పెళ్లాం సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ - రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి నాకు మిత్రులు. ఆయన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది అంటే విని ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాను. సీఎంగా అజయ్, ఆయన భార్య పాత్రలో ఇంద్రజ నటన ఆకట్టుకుంటుంది. ఈ రోజు మా మూవీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశాం. హైదరాబాద్ నగరం గురించి చేసిన ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది. త్వరలోనే మా సీఎం పెళ్లాం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ - ఈ సాంగ్ చూశాక చాలా ఎమోషనల్ అయ్యాను. సీఎం పెళ్లాం చిత్రంలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ చేశారు. ఇంద్రజ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నేను సీఎంగా చేసినా సినిమా మొత్తం ఇంద్రజ గారే ఉంటారు. నటీనటులు ఎలా సమయపాలన పాటించాలో ఇంద్రజ గారిని చూసి నేర్చుకున్నాను. మా డైరెక్టర్ గడ్డం రమణా రెడ్డి గారు మూవీని పర్పెక్ట్ ప్లాన్ తో రూపొందించారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుంది. సీఎం పెళ్లాం సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ - సీఎం పెళ్లాం సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో వస్తోంది. సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈసినిమాలో మా డైరెక్టర్ గారు చక్కగా చూపించారు. ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రమిది. ఈ చిత్రంలోని సీన్స్ కు మీరంతా కనెక్ట్ అవుతారు. మీ రియల్ లైఫ్ లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా సీఎం పెళ్లాం మూవీలో చూస్తారు. మాదొక చిన్న సినిమా. ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను మీ ముందుకు త్వరలో తీసుకొస్తున్నాం. సీఎం పెళ్లాం చిత్రానికి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు గడ్డం రమణా రెడ్డి మాట్లాడుతూ - మా సీఎం పెళ్లాం సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ హైదరాబాద్ నగరం నేపథ్యంగా రూపొందించాం. మన నగరం ఎలా ఉంది అని ఈ పాటలో చూపించాం. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం పడినా చుక్క నీరు నగరంలో నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నా. ఒకే ఒక్కడు చిత్రంలో వన్ డే సీఎంను చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. సామాజిక నేపథ్యమున్న చిత్రమిది. మంచి మెసేజ్ ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. త్వరలోనే మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.