శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ గారు రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి గారు శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్య సభ్యులు లక్ష్మణ్ గారు, ప్రభుత్వసలహాదారు కే. కేశవరావు గారు పాల్గొన్నారు. ముందుగా విజయ తెలంగాణ పుస్తకాన్ని ఎడిట్ చేసి సలహాలు సూచనలు చేసిన విక్రమ్ పోల కు CM రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో
ముఖ్యమంత్రి శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేవేందర్ గౌడ్ గారిని నేను వ్యక్తిగతంగా ఎక్కువగా అభిమానిస్తుంటాను. వారు రచించిన పుస్తక ఆవిష్కరణకు నేను ఇలా రావడం, నాతో పాటు దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, హన్మంతరావు గారు, మధు యాష్కీ గారు పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇదేమీ దేవేందర్ గారి స్వీయ చరిత్ర కాదు. ఇది తెలంగాణ చరిత్ర. ప్రజలు అనుభవించిన కష్టాలను ప్రతిబింబించేలా రాశారు. తెలంగాణ కోసం అమరులైన వారి గొప్పదనాన్ని, వారి పోరాట స్పూర్తిని వారికి వారు లిఖించుకోలేరు. మేం ప్రభుత్వంలోకి వచ్చాక పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గోన్న దేవేందర్ గౌడ్ గారు రాయడం అభినందనీయం. నాయకుడితో పాటుగా సరి సమానంగా దేవేందర్ గౌడ్ గారి స్థాయి ఉండేది. వ్యక్తిగా నష్టం ఏర్పడినా పర్లేదు అని తెలంగాణ కోసం పోరాడారు. ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఉద్యమంలో ముందుండి అందరినీ నడిపించారు. ఆయన ప్రభుత్వాల మీద చేసిన ఒత్తిడి వల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ వచ్చింది. తెలంగాణను టీజీ రూపంలో రాయాలని ఆయనే చెప్పారు. కానీ దాన్ని టీఎస్‌గా మార్చారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత టీజీగా మార్చాం. మాకు కేంద్రం కూడా సహకరించింది. ప్రజలు కోరుకున్న విధంగా టీజీ వచ్చింది. పెద్దలు దేవేందర్ సూచించిన టీజీని.. ప్రజలు గోడలపై కాకుండా గుండెల్లో పెట్టుకున్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా మార్చలేదు. ప్రజల్లోంచి వచ్చిన ఆ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా మార్చాం. ఇవన్నీ చరిత్రలో నిక్షిప్తం కావాలి. వీటన్నంటినీ క్రోడీకరించాలి. ఏ తప్పు లేకుండా అసెంబ్లీలో మాట్లాడాలి అని దేవేందర్ గౌడ్ గారు గంటల కొద్దీ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేవారు. దేవేందర్ గౌడ్ గారి అనుభవానికి వెలకట్టలేం. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకుంటూ ఉంటాను. తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాను. ఆయన ఇలాంటి ఓ గొప్ప పుస్తకాన్ని రాయడం ఆనందంగా ఉంది. ఆయన ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లోకి లేకపోవడం దురదృష్టకరం. ఒకప్పుడు రాజకీయాలు టెస్ట్ మ్యాచుల్లా ఉండేవి.. ఇప్పుడు టీ20ల్లా ఉంటున్నాయి అని దేవేందర్ గౌడ్ గారితో అంటుంటాను. ఇలా విమర్శలు చేసుకుంటూ ఇలాంటి ఆటలు ఆడాలని నాకు లేదు. కానీ ఇప్పుడు ఇలా ఉండకపోతే కుదరడం లేదు. పోటీలో నిలబడి, గెలవాలని అనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ తప్పడం లేదు. నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడే అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చలు పెట్టాను. కానీ రాను రాను ఇప్పుడు ఉన్నట్టుగా మారింది. దీనికి పుల్ స్టాప్ పడాలి. విలువలతో కూడుకున్న రాజకీయ నాయకులు, ప్రజా సమస్యల మీద పోరాడే నాయకులు ముందుకు రావాలి. దేవేందర్ గౌడ్ అన్న రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు దొరికిన అదృష్టం అని అన్నారు.
శ్రీ తూళ్ల దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఏదీ ఉచితంగా రాలేదు. పోరాడి సాధించుకున్నారు. అందుకే ఈ పుస్తకానికి విజయ తెలంగాణ అని పెట్టాను. పోరాటలకు నిలువైన గడ్డ. ఆజాంజాహీలు కేవలం 200 ఏళ్లే పరిపాలించారు. కానీ రెండో శతాబ్దంలోనే శాతావాహనులు కోటి లింగాల కేంద్రంగా దక్షిణాదిని పరిపాలించారు. విష్ణు కుండినులు కీసరగుట్టని కేంద్రంగా చేసుకుని 300 ఏళ్లు పరిపాలించారు. కాకతీయులు అద్భుతంగా పరిపాలించారు. కూతుబ్ షాహీలు, నైజాంలు కొంత కాలమే పరిపాలించారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతం. సముద్రమట్టానికి ఎత్తులో ఉన్న ప్రదేశం. ఇలా మన ప్రాంతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి భాషా, సంస్కృతి మీద ఎంత దాడి జరిగిందో అందరికీ తెలిసిందే. పన్నులు, శిస్తులు అంటూ నైజాంలు పట్టి పీడించాయి. అందుకే సుద్దాల గారు బండెనక బండి కట్టి అని పాట రాశారు. రైతాంగం చేసిన సాయుధ పోరాటం ప్రత్యేక చరిత్ర. భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలియాలని ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకం వల్ల టూరిజం కూడా పెరుగుతుంది...